Monday, February 17, 2014

అదో అంటరాని వసంతం ..
మట్టికి చలేస్తే...
గుడిసెల్లో మడుసుల్ని కప్పుకుంటుంది!!!!
అదో అంటరాని వసంతం...
మన జీవితాల్లోంచి
ఆ దృశ్యాలను ఓ మూలకు నెట్టేస్తూ
మనకు నచ్చిన చోట మనల్ని మనం నాటుకుంటున్నాం!!!
 


Friday, February 7, 2014

"Little things called ♥ "నే కరిగి పోవటం
బహుశా నువ్వెప్పుడూ చూసుండక పోవచ్చు....
చూసే అవకాశమూ ఇక రాకపోవచ్చు!!!
నువ్వెళ్ళాక పర్చుకున్న చీకటిని తరిమేందుకు
నన్ను నేను ఎన్నిసార్లు వెలిగించుకున్నానో...
ఆ వెలుగులో నిన్ను నే చూసుకుంటూ ఓ వైపు ..
మైనానై బాధగా కరిగిపోతూ మరో వైపు...

ఈ క్షణాలకు జాలిలేదు
నన్ను అమాంతం మింగేయాలన్న ఆతృత తప్ప!!!!

నీ ప్రేమ వర్షం నాపై కురిసే ముందు...
నీ చూపుల దారులలో
నే మొలకెత్తాను!!!
చిగురించాను!!!!
పుష్పించాను!!!!
ఒక్కో క్షణం ఎండుటాకులా రాలిపోతుంటే..
ఆశావాదం లో ముంచి అంటించుకున్నాను....

కానీ ఏం లాభం!!
ప్చ్.... యుగాలు వేచాను...
క్షణాలలో నన్ను దాటెల్లిపోయావ్!!!!!

నేను నువ్వైపోవాలని
నా ప్రేమను నీకు చెప్పేందుకు
నీకోసం రోజుకో పువ్వేడ్చేది!!!
నువ్వులేవిపుడు!!! ఇకపై రోజూ నేనే ఏడ్వాలి....

నువ్వు ఋతువైనా బావ్వున్ను!!!!
తిరిగోస్తావనే ధైర్త్యం....చిగురిస్తానన్న ఆశ ఉండేవి...
నీకేం తెలుసు??
రోజూ నీ జ్ఞాపకాలు....
ఎన్ని సార్లు నన్ను చిద్రం చేసి వెళ్తాయో!!!
నే కోల్పోయినదేంటో...
నన్ను దాటి వెళ్ళిపోయే రాత్రులకు తెలుసు!!!
నీవై ఉదయించిన నా జీవితం లో
నిన్నటికి -రేపటి కి మధ్య....
ఈ రోజింత ఇరుకుగా ఉందెందుకో!!!
నాలోని నిన్ను అడిగేది ఒక్కటే...

ఒక్కసారి రాలేవా???
నా నమ్మకాన్ని అబద్దం చేసేందుకైనా!!!Tuesday, July 30, 2013

సత్యాన్వేషి
నేను నిన్ను నిద్రలేపలేకపోవచ్చు కానీ
నువ్వు మేల్కొనొచ్చేవరకూ నీ ఇంటి బయటే ఉంటా!!!
నిద్రలేచి నువ్వొచ్చాక
నువ్వు ఓడిపోయావనో లేదా నేను గెల్చాననో చెప్పేందుకో!!
లేదా నువ్వు ఇకనైనా మారాల్సిందే అని చెప్పటానికో కాదు -
నేనింకా మారలేదని నీకు తెల్పేందుకే...

మరి క్రొద్ది సేపట్లో నేను తిరిగెళ్ళిపోతాను
నేను కనుమరుగయ్యేంతలోనే
నీకు సమాధానం దొరకొచ్చు
దొరికింది కదా అని నన్ను పిలవకు
ఇప్పుడు నువ్వేంటో నీకు తెల్సు
నువ్వేంచేయాలో కూడా నీకు తెల్సు
అప్పుడిక ఆలస్యం చేయకు-
రేపటిని ప్రశ్నించేందుకు సూర్యుడ్ని తోడ్కొని బయల్దేరు .... 


Wednesday, June 5, 2013

హతోస్మి1
నేనివేళ నవ్వగల్గుతున్నాను

చిన్నప్పటి మా ఇంటి

చిన్నగది చిన్నబోయేలా నవ్వగల్గుతున్నాను!!!చెప్పులకు డబ్బులడిగితే

నాన్నెక్కడ తిడుతాడోనని

చిల్లుబడ్డ చెప్పులోంచి బాల్యాన్ని కాల్చుకున్న

రోజులు సిగ్గుపడేలా నవ్వుతున్నాను!!!!ఇరుకు సందుల్లో నలిగిన

నా పసితనం గుర్తుకు తెచ్చుకు మరీ నవ్వగల్గుతున్నాను...నవ్వుతున్నాను

నవ్వుతున్నాను

నవ్వుతూనే ఉన్నాను....

ఎంతవరకు నవ్వానంటే..

రాజసౌధం లాంటి కొత్తింటి కిటికీ తీసి

ఎదురుగా కనబడ్డ చెట్టు క్రింద

నిన్నటికీ - రేపటి మధ్య ఇరుక్కు పోయిన

చిల్లుల బట్టల్లోని అరవైఐదేళ్ళ అసహాయత

నిస్సహాయపు చూపులు నాలో ఇంకేదో వెతుకుతున్నాయని

నాకర్దమయ్యేంత వరకూ నవ్వాను....

అతిధులందరూ వచ్చారు ఇక మీరూ రండని

నా శ్రీమతి అనుండకపోతో ఆ వృద్దుని

చూపుల అగాదాల్లో అంతర్దానమైపోదునేమో!!!!2
పదిహేనేళ్ళు గడిచిపోయాయి...

ఇప్పుడు సినీవినీలాకాశంలో నేనో పెద్ద స్టార్ ని...

ఈ పదిహేనేళ్ళలో రోజెప్పుడు మొదలైందో

నేనెక్కడ ఆగానో తెలియని పరుగు...

ఇంతపరుగులోనూ

నన్ను కట్టిపడేసే ఆ చూపులు

ఇల్లు దాటి వెళ్ళేప్పుడు

కారు అద్దాలు దాటి మరీ నన్ను శోధించాయి!!!

తన మెలుకువ చూపులకు

చిక్కకుండా పోవడమన్నది ఏ ఒక్కసారీ జరగలేదు!!!నా ఈ సినీ ప్రయాణంలో

నా పేరున సేవా సంఘాలు

సామాజిక కార్యక్రమాలు

నాలో మానవీవకోణాన్ని ఆవిష్కరిస్తే..

సినీ జీవితం పేరు ప్రఖ్యాతులను

రాజకీయరంగం మంత్రి పదవిని కట్టబెట్టింది3
ఈ రోజే ప్రమాణ స్వీకారం...

నన్నిన్ని రోజులు సోదించిన చూపులకు

సమాధానం దొరికిందో లేదో నని తెలుసుకోవాలనిపించి

నన్ను అభినందించేందుకొచ్చిన అశేష జనవాహిని మధ్య నుండి

మాసిన బట్టలలో రోజులు లెక్కించే వృద్దాప్యానికీ నాకు

మధ్య దూరం ఇంతదగ్గరగా ఉందని తెలుసుకునేందుకు నాకు

పదిహేనేళ్ళు పట్టిందని తెలుసుకొని సిగ్గుపడ్డా!!!నేనీ ఇంటికొచ్చి పదిహేనేళ్ళయింది...

నే కనిపిచ్చినప్పుడల్లా నాలో నువ్వేదో వెదికేవాడివి...

ఏమిటది???

తన పెదాలు కదులుతున్నాయి...

శక్తినంతా కూడదీసుకొని

ఒక్కో మాట కి తనకు మిగిలిన ఆయుష్షు పోస్తూ

ఇ న్నా ళ్ళు గా.... నే  నీలో ...వె తి కిం ది...

మ............ని.........షి..........ని....... 
.
.
.
.
తన ఈ  సమాధానం విని చూసేందుకొచ్చిన

నా తొలి కన్నీటి బొట్టుతన దేహాన్ని  ముద్దాడేంతలోనే

ఆ చివరి మాట పూర్తైన

క్షణం తరువాతి తను - క్షణం ముందటి నేను

ఒక్కసారిగా చచ్చిపోయాం!!!!!!!!
 

.

Wednesday, May 15, 2013

ఎందుకు రాములా???

1
ఎప్పట్లానే....
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కాడు రాములు!!!
మొదలెట్టిన చోటికే
తిరిగొస్తానని తెలిసీ 
నిన్నటికి దూరంగా
వెళ్ళాలనే ప్రయత్నంలో
ఐస్బండిని నెట్టుకెళ్తూ

2
రోజూ చేసే పనే అయినా
విసుగు రాదెందుకో...
విసుగురాదని మనమనుకోవటమేనేమో!
వచ్చినా దాన్ని రాములు
ఏరాత్రికారాత్రి
తన ఆత్మస్థైర్యపు వెలుగుకి
ఆవలున్న చీకట్లోకి విసిరేసి
తెలవారగానే
మళ్ళీ ఎప్పట్లానే
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కేస్తాడు రాములు!!!

3
ఏంది రాములా!!!
ఇంకెన్నేళ్ళు నెట్టుకొస్తావు
ఈ ఐస్బండిని
అన్న వారందరికీ
"నేను నెట్టుకొచ్చేది
ఇస్బండిని కాదు! నా కుటుంబాన్ని"
అన్న సమాధానం చెప్పికానీ,
ఆ కుటుంబాన్ని! కాదు కాదు
ఆ ఇస్బండిని నెట్టుకు పోడు...

4
కొందరి కళ్ళకి ఆ రోడెందుకో
నీరసంగా ఉంది కొన్ని రోజులుగా
రాములు పాదాల ముద్దుల్లేక!!!
అంతగా దగ్గరయ్యాడు చాలామందికి రాములు...

5
ఏమైఉంటుందోనని చూసేందుకు
రాములు ఇంటికి వెళ్లిన వారందనినీ
ఓ దృశ్యం మాత్రం కలచివేసిందాయింటి ముందు...!
అక్కడిప్పుడు
ఐస్‌ఫ్రూట్ తినటం పూర్తయ్యాక
విసిరి పరేసిన పుల్లలా
రాములు లేని ఐస్బండి!!!!!

Monday, May 13, 2013

అమ్మలేనితనం

ఆమె జీవితం ఓ సముద్రం,
ఎన్నో ఆటుపోట్లను తన
కన్నీటి తీరం దాటి రానిచ్చేది కాదు!
కానీ,
అవి దాటివచ్చిన ప్రతిసారీ
ఆమె చీరకొంగు తనలో
ప్రేమగా నింపుకునేది...

ఇప్పుడు అమ్మలేదు!!!
తనుగుర్తొచ్చి
నేను ప్రేమగా కొనిచ్చిన
చీరను హత్తుకొని
బాధ పడే ప్రతిసారీ
నా చేతిని అమ్మ చీరకొంగు
తడుపుతూనే ఉంది!!!


* అమ్మను కోల్పోయి ఆమె జ్ఞాపకాలతో బాధ పడేవారందరికీ..
...ఆమె ప్రేమ ఏదో ఒక రూపంలో మిమ్మలి స్పృశిస్తుంది...
...ఎప్పటికీ అలానే స్పృశిస్తూనే ఉండాలని ఆశిస్తూ....
...మాతృదినోత్సవ శుభాకాంక్షలు...

Thursday, May 9, 2013

అ - "అమ్మ"

అవును తను బిక్షగాడే!!!
తల్లి గర్భంలో మనలా స్వచ్చంగా పెరిగిందితడే...

కన్నీటిని వార్చి....
సంతోషాల్ని వడ్డిస్తుంది అమ్మ!!!

అమ్మ జీవితమోరోజే!!!
సగం వంటిల్లు! - సగం కన్నీళ్ళు!

అమ్మని చూసానీరోజు...
Web Cam ముందు వెక్కి వెక్కి ఏడుస్తుంటే!!!

చావు ముంగిట విలపిస్తున్నా!!!
ఒక్క సారొచ్చి చూసిపో బిడ్డా.....

సమాధిపై చెట్టు మొలిచింది!!!!
అమ్మకి నేనెండలో ఉండడం ఇష్టంలేదు.... 
 
 

Tuesday, May 7, 2013

నువ్వింకా మారలేదు!!!


నేను ఎవరిని?
కులం గంజాయి మొక్కని చెప్తూ..
తులసి కోటలో పెట్టి పూజించే అబద్దానివి!!!!!

ఆమెవరు?
కుల మతాల గుప్పెట్లో..
ఇంకా బందీగా ఉన్న స్వేచ్చాపావురం!!!

వీరంతా ఎవరు?
ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి...
ఓదాన్లో కులం! ఓ దాన్లో మతం నింపిన
కావడినందించేందుకొచ్చిన తెలివైన వారు!!!

అతని నవ్వెందుకు అంత స్వచ్చంగా ఉంది?
చనిపోయాడు కదా! ఇక ఎవరి కోసం నటించాలి!

చివరిగా...
ఇంతకీ నీవసెంత?
మీరంతా నన్ను పిచ్చోడ్ని చేసి..
ఇప్పటి కి సరిగ్గా మూడేళ్ళు!!!!!!
 
 

Tuesday, April 23, 2013


Monday, February 18, 2013

Black & White


సీన్ : 1
---------
కొన్నేళ్ళ క్రితం సరిగ్గా ఇక్కడే....
మానవత్వానికి మనిషికి
దూరమెంతుందో చూపే మైలురాయిలా!
ఊరిబయట ఎప్పుడొచ్చిక్కడ
చేరాడో తెలియదుకానీ,
కాలంతో పాటే
కదులుతున్నట్లే అనిపించినా...
గోడగడియారంలో కడ్డీలా ఉన్నచోటే మిగిలిపోయాడు .

సీన్ : 2
----------
కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో
ఎన్నో సంఘర్షణల మధ్య ఎదురొడ్డి నిలబడ్డ
ఓ రాయి .... రాయే!
ఎవరు విసిరేసారో
ఎపుడు విసిరేసారో తెలియదు కానీ
దానికిన్నాళ్ళకో మంచి తోడుదొరికింది.

సీన్ : 3
--------
మనుషుల మధ్యే
ఓ ప్రశ్నగా మిగిలిన మనిషతడు!
ఈ విశాల ప్రపంచంలో
తనకంటూ మిగిలిందీ రాయొక్కటే!
ఎందుకు నవ్వుతాడో తెలియదు,
ఏం గుర్తొచ్చేడుస్తాడో తెలియదు,
కానీ ఎప్పుడూ ఏదోకటి చెప్తుంటాడు...
ఆ మాటలకడ్డుపడని రాయి,
ఆలకించిందో లేదో తెలియదు కాని,
చినుకు మీదపడ్డప్పుడల్లా,
ఆ మనిషి కష్టాలు గుర్తొచ్చి
ఏడ్చినట్టే కన్పించేదీ ప్రకృతికి!

సీన్ : 4
--------
ఇప్పుడక్కడంతా కోలాహలం!
ఎవడో ఓ అబద్దాన్ని
కల పేరు చెప్పి తీసుకొచ్చాడు!
అది రాయికాదట!
మనరాతల్ని మార్చే దేవుడట!
అట,అట అట.....అంతేనట!
ఎన్నాళ్ళుగానో ఇక్కడే ఉన్న
ఇతని ఆకల్ని గుర్తించని వీరికి!
రాయిలో దేవుడున్నాడంటే..
గుడికట్టించేందుకు
ముందుకొచ్చిన దాతలెందరో...


సీన్ : 5
--------
ఇప్పుడా రాయి....
ఎండకెండట్లేదు!
వానకి తడవట్లేదు
మాటల్రాని ఆ రాయికి.
నేను కేవలం రాయినే
అని చెప్పుకోలేని నిస్సహాయత!
నాకెందుకీ ప్రసాదాలు...
రోజూ వాడాకలి తీర్చండి
అని చెప్పేందుకు మాటిమ్మని
రోజూ ఆ దేవుడ్ని ప్రార్థిస్తూనే ఉంది...

సీన్ : 6
--------
ఇప్పటికీ ఆ మనిషిక్కడే ఉన్నాడు,
అప్పుడు ఊరి బైట!
ఇప్పుడు గుడి బైట!
కాకపోతే
ఇప్పుడేదన్నా చెప్పుకునేందుకు!
పక్కన ఆ రాయిలేదు!
అదిగుర్తొచ్చి గుడ్లోకి
పోయేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ,,
వాడికి దేవుడు పూనాడంటూ
హుండీల్నింపుకుంటున్నారు!
తన అకలి మాత్రం ఇంకా అలానే ఉంది !
మనబుర్రల్లో............................. అజ్ఞానంలా!!!

Tuesday, January 29, 2013

Save as


ఇంకెన్నాళ్ళు???
అంతః ప్రవాహ అంతిమ చిత్రం!
ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు,
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

సమాజానికో అద్దం ఇచ్చి,
క్షణక్షణానికి రంగులు మార్చి,
ముందున్నప్పుడు వెనుకకు చూపి,
వెనకున్నప్పుడు ముందుకు చూపి,
ముందు వెనుకలకు మధ్యన పెట్టి,
తడికలు చుట్టి గంతలు కట్టి,
నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

నీది కాని నీ తనువుని చూస్తూ,
తడబడి పోతూ,
తమకపు కన్నులు చప్పుడు చేస్తూ..
తప్పులుచేస్తూ తిప్పలుపడుతూ..
క్రొద్దిసేపేమో కన్నీరంటావ్,
క్రొద్దిసేపేమో పన్నీరంటావ్,
కన్నీటిలోన పన్నీరు కలిపి
తప్పక ముందుకు సాగిపోతున్న,
తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది!
బ్రతుకు బండిపై ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని,
బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ...
నన్నే చూస్తూ నిన్నే తిడుతూ,
నీకూ-నాకూ గొడవలు పెడుతూ,
కడుపులు కొడుతూ,
కలుపుని తింటూ...
తప్పులు చేస్తూ ముందుకు సాగే,
వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!
నీది కాని నీ తనువుని మోస్తూ,
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

Wednesday, October 17, 2012

ఎందుకంటే.... నేను "కవి"ని

అన్యాయాన్ని సహించలేను...
ఆవేశాన్ని ఆపుకోలేను.
కాగితాలపై కొలువుతీరిన
అక్షరాన్నై ఆవిష్కృతమౌతాను!

లిక్కరు కిక్కు లో ముంచిన
ఆలోచనల్ని కళ్ళాపిచల్లి
దానిపై తీరిగ్గా
"తూలుతున్న జనజీవనం" అని
ముగ్గులేసి మురుస్తాను

ఆకలిని గూర్చి రాసుకుంటూ..
నా Order ఏది అని అరుస్తాను,
పేదరికాన్ని గురించి మాట్లాడుతూ...
నాకు ఎదురయ్యే వారి బట్టల వాసనల్ని
తప్పుకుంటూ జారుకుంటాను !

కనులతో కామించి,
కలంతో ప్రేమిస్తున్నానని..
అబద్దాలాడిస్తాను!

చలిలో వణికి పోయే...
రోడ్డు మీది దేహాన్ని..
అమాంతం కనులతో తినేసి..
అరిగిన ఆలోచనల్ని అందంగా విసర్జిస్తే..
మూడడుగుల పట్టు శాలువా నా భుజాన...
చప్పట్ల మధ్య మురిసిపోయింది...
ఆ అబద్ధాన్ని మోసుకుంటూ మళ్ళీ..
ఆ చలిలో వణికే తనువుల ముందునుంచే వెళ్తాను...
ఎందుకంటే....
నేను "కవిని"
"క"నిపించని "వి"కారాన్ని !!!!!!

మానవత్వానికి సుస్తి చేసింది!

1.
అభం శుభం తెలియని పిల్లల,
బలపాల క్రింద నలిగి పోయే అక్షరాలకు...
ఎవ్వరికీ వినపడని రోదన తట్టి తట్టి పిలుస్తుంటే..
ఎవరిదా ఏడ్పు?? అన్న ప్రశ్నకు...సమాధానం,
లీలగా వింపించింది ఓ కనికరం లేని స్వరం,
మాటలను వృదాగా తోడిపడేస్తూ...
..............
"ఎవరో తెలుగు తల్లట!
కాన్వెంటు ముందు ఏడుస్తుంది..... (నరేష్ కుమార్)"

2.
చిందర వందరగా పడిపోయిన జ్ఞాపకాలలో,
రేపటి వెలుగుని చూడని నిన్నటి రాతిరినై...
ఈసారైన ఓ సందేశం అందుతుందని!
ప్రతి అలనూ చదివిచూసే తీరాన్నై..
నీ మాటకోసం వేచివున్న నన్ను వదిలేసి,
జ్ఞాపకాల మద్యనుంచి వెళ్ళేందుకు తటపటాయిస్తున్న,
నీకోసమే....
.............
"కన్నీటితో నీ దారిని
శుభ్రం చేశా...నిర్భయంగా వెళ్ళు" ........."మెర్సీ మార్గరెట్"

3.
క్షణాల్లో మారిపోయే జీవితాలే అయినా..
ఎప్పటికప్పుడు రాబొయే రేపటికి,
కలల గదిలో ఆశ్రయమిచ్చి...
ఆశల బీరువాలో దాచిన,
కోర్కెల నగలతో ముస్తాబు చేసి..
మురిసిపోతూ కలల గడప దాటి,
ఒక్క సారిగా నిజోదయాన్ని చూసి...
తెలవారగానే మళ్ళీ విసిగిపోయిన మనిషీ..
ఒక్కసారి నిజాన్ని తొడుక్కొని చూడు
.........
"విసిగి వేసారడమంటే...
నిన్నటి జీవితాన్నే మళ్ళీ తొడుక్కోవడం!!!.........."క్రాంతి శ్రీనివాస రావు గారు""

4.
ప్రేమ అన్న రెండు అక్షరాల మధ్య,
దారేలేనట్లు ఇద్దరమూ ఒకటై కలిసి నడిచిన..
నిన్నటిలోంచి అమాంతం బయట పడి!
నీదారి నీది - నాదారి నాది,
అన్న మాటలు పడ్డ చోట,
దహించుకు పోతున్న తిరిగి నన్ను చేరిన నువ్వు,
మళ్ళీ అడుగుతున్నావా కలుద్దామని...
సరే నువ్వే చెప్పు నిజాయితీగా...
...............
"ఎక్కడ కలుద్ధాం! విడిపోయిన దగ్గరేనా????........."వంశీధర్ రెడ్డి""

5.
నిజన్ని క్రింద పరుచుకుని నిశిని కప్పుకొని,
భ్రమల్లో నీలోకి చేరిన విత్తనానికి..
కాలమనే నీరు తాకి బయటపడిన
రక్తావతారాన్ని కర్కశంగా విసిరేందుకు,
నీలా ఎందరో సిద్దపడారు కాబట్టే!
.................
"కన్న ప్రేమ తరిమేస్తుంటే
చెత్త కుప్పలు తల్లులు అవుతున్నాయి."........"అనిల్ డ్యాని"

Friday, June 22, 2012

ఏమయింది! ఏమయింది!

నన్ను తాకిన పరిమళానికి,
మల్లె తనువులు ముద్దులిడెనా..
మత్తు మత్తుగ హత్తుకుంటూ,
మైకమై నా మీద వాలెను!
నిన్ను వెతుకగ నన్ను తరిమి,
నీడలా నా వెంట వచ్చెను,
ఏమయింది! ఏమయింది!
నిన్ను చూడగ నాకేమయింది!

ఎంత కాలము ముస్తాబు చేస్తివో..
నా కంటపడెను నీ చూపు హొయలు!
చూడమంటూ నా భుజము తడుతూ..
చూడగానే సిగ్గంటూ దాగుతు,
అల్లరెంత చేసినాయో...అలసిపోయిన మనసుకెరుక.
ఏమయింది! ఏమయింది!
నిన్ను చూడగ నాకేమయింది!

****** నచ్చితేనే కామెంట్ వ్రాయండి...
 

Tuesday, May 8, 2012

లెక్కలన్నీ పూర్తయ్యాయా..!


విడిపోయేందుకు సిద్దపడ్డావ్!
నీ చూపుల కిరణాలు తాకి,
చివురించిన మది పుష్పం!
వాడిపోతే నీకేంటని,
తిరిగి రాని కాలంలా!
నన్ను దాటి వెళుతున్నావ్...

ఆశ నిరాశల మధ్యన,
జ్ఞాపకాల రాశులలో!
నిన్ను వెతకమని చెప్పి,
నన్ను ఒంటరిని చేసి...
అమావాశ్య వెన్నెలవై,
ఏ కలువను మురిపిస్తావో??

సమీపించిన సమీరమా...
అలరిస్తావని ఆహ్వానిస్తే,
వడగాలివై నను కావలించుకొని!
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే,
రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకవై...
నువు విడిచిన గొంగలిని నాపై కప్పి..
బాధించే జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చెళ్ళావా!!!
 

Monday, May 7, 2012

అబద్దాల చిరునామా!


నా నమ్మకాన్ని అమ్ముకున్నావా!
....
ఆశలతో నిర్మించిన అందాల లోకాన్ని...
సుదూర ప్రేమ తీరానికావల విసిరేసి..
వాడిన నవ్వులతో నిత్యం పలకరించే..
నీ నవ్వు అబద్దం!
కనుల మాటున నిజాన్ని దాచి,
నన్ను మాయ చేసిన నీ చూపబద్దం!
నీవు చేసిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు.
నువ్వేది చెప్పినా నమ్మే మనసు,
నీ మాయలోంచి బయటపడి...
ఎడతెరిపిలేని కన్నీటి వర్షం లో తడుస్తున్నా...
పట్టించుకోని నువ్వబద్దం!
 

Wednesday, April 18, 2012

బాటసారి...


చేజిక్కిన సంతోషాన్ని జారకుండా అందుకుని,
నీ జ్ఞాపకాలను మూటకట్టి,
భుజానేసుకు సాగిపోయే బాటసారిని నేనే!
చెప్పకుండా వెళ్ళిపోతూ నాకో వదిలెళ్ళిన,
అడుగుల జాడలు వెతుకుతు,
పగలనకా....రేయనకా...
మజిలీలను దాటుకుంటు,
నీకోసమే వస్తున్నా...
జాడలేని జాబిల్లి!
అమావాస్య వీడి నువ్వు,
నన్ను చేరు వెన్నెలవై..Wednesday, February 1, 2012

దాగుడుమూతలు


నిన్ను నే చూసిన క్షణాన,
పూలవాన నీపై కురవలేదు!
పండు వెన్నెల నిన్ను చూసి పారిపోనూ లేదు!
వెలుగు వెలిసిపోలేదు!
ఇంద్రధనుస్సు విచ్చుకోలేదు!
ఆకశాన ఆ నక్షత్రాలు నీ కనులలో ప్రతిబింబించలేదు !
అమాంతం ఓ వెలుగు నను చేరనేలేదు!
కా...
నీ...
నిన్ను చూసి వెళ్ళిన రాత్రి.
నా ఊహలలో పైన చెప్పిన ప్రతిదీ..
ఒక్కొక్కటి గా నా కనులలో ఆవిష్కృతమై,
కనులు తెరిచేముందు అస్తమించాయి,
మరుక్షణం కనులు మూసినా...
నీ తలపులే ఉదయిస్తాయి.
కనులు తెరిచేవరకూ వెళ్ళనని మారాంచేస్తాయి.

Tuesday, January 31, 2012

" హులక్కి "


ఏమిటో యీ విచిత్రం
తిని మిగలంగా పారేసే అన్నం కోసం ఎదురు చూసే పేదబ్రతుకులు,
రేపటికోసం ఎదురు చూడని మొండి మనుషులు,
సిమెంటు చాపలు-చిరిగిన దుప్పట్లు-మాసిన సంచులు,
ఎందుకో ఇంత వైరుద్య జీవన విధానం,
ఏమిటో వారిని కమ్మిన వైరాగ్యం.
ఆలోచనలు కదలటం లేదు,
వారి మోములే కనులముందు మెదులుతూ వున్నయి,
ఏమి చేయలేమా?
ఒక్కరోజుతో సరిపెట్టటం కాదు,
ఒక్కొక్కరినీ సమ్మూలంగా మార్చివేయటం.
ఆ క్షణాన మోముని వికసింపజేసే చిల్లర తప్ప ఏమీ అడగరా?
మమ్మల్నీ మనుషుల్లా బ్రతకనివ్వండని ఎవ్వరినీ వేడుకోరా?
అయినా వారడిగితే ఇచ్చేదెవరు?
వారి కోర్కెలని తీర్చేదవరు?
వారి బ్రతుకులు ఎన్నటికీ హక్కులు లేని హులక్కి బ్రతుకులే!!!

Monday, January 30, 2012

"What is Love"నేపడుకున్నా నీచుట్టూ తిరిగేనా ఆలోచనలు మెలుకువతోనే వుండటం,
నీధ్యాసలో పడి నేనేమిచేస్తున్నానో కూడా తెలుసుకోలేకపోవటం,
ఒక్క క్షణం నువ్వు నాముందుంటే తిరిగి న్వ్వు కనిపించేవరకు ఆ జ్ఞాపకాన్ని మదిలో భద్రంగా దాచటం,
నీ నీడగా మారేందుకు ప్రయత్నించటం.
నీ ఊహలో బ్రతికేయటం.
నీ నవ్వుకై తపించటం
నీకోసమే జీవించటం.
...
నా మనసే నీవశమై,
నన్నెపుడో వీడిపోయి...
నీతోటే ఉంటానని నను నీవైపుకు లాగుతుంది...
ఇక తప్పని ఈ తిప్పలతో తడబడుతూ చెబుతున్నా...
I Love You.....


Saturday, January 28, 2012

"Really I Hate U"


నీవులేని ఈ క్షణాలు ఇపుడు భారంగాలేవెందుకు?
నీవు విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు ఎచట సేదతీరుతున్నాయో!
నా ఆలోచనవై నడచిన నీవేనా అది?
నా మనసునెరిగినట్లు తలూపిన అమాయకత్వమేనా అది!
వద్దనుకుంటూ మళ్ళీ అదే పంజరాన చేరావు?
ఋజువులు కావాలంటే నావైపు కోపంగా చూడటం కాదు!
నీ మనసు చెప్పే సమాధాన్ని ఓపికగా వినుముందు.
నీ మీద కోపం లేదు!
అలా అని జాలీ లేదు!
ఎందుకంటే ఎప్పటికీ నువ్విక రెండింటికీ చెడ్డ రేవడివే!!!

Sunday, November 6, 2011

మౌనం మాట్లాడింది!


మౌనం మాట్లాడింది!
తొలిసారి నన్ను చూసి ఆరాధనగా..
ప్రతిసారీ ననే గమనిస్తూ అభిమానంగా...
నీ నుంచి దూరమయ్యెప్పుడు అయిష్టంగా...
నిరీక్షానంతరం ఎదురవగానే ప్రశాంతంగా..
ఎన్నని చెప్పను మౌనానికి ప్రతినిధిగా నీ కనులు,
వెల్లుబుచ్చిన కమణీయ ప్రేమసందేశాలను
.

Monday, September 26, 2011

ఏమైంది?
నిన్నే చూసి మనసంది...
నీలా నువు లేనే లేవు ఏమైందీ?
నీకై నీవు ప్రశ్నయితే...
ఎలా? మది ముంచేస్తుందీ.. వరదై!


కష్టాలు కన్నీళ్ళన్నీ కమ్ముకున్న వేళ!
నీ మనసే ఓదార్పల్లే మారుతుంది చూడు..
చెంపల్ని తాకుకుంటు కారేటి కన్నీళ్ళు!
చిరుగాలి తాకగానే తొనికిసలాడు.


నిశిలోన నిలబడి వుంటే వెలుగులు రావు!
మినుగురులా  నీకైనీవు వెలుగుతు నిశినే దూరంగా పంపు..  ||నిన్నే చూసి||


కన్నీరు సంద్రంలాగ నిన్ను చేరు వేళ!
తీరంలా సంద్రానికి హద్దుగీసి చూడు.
లోకంలో కష్టాలంటూ లేనివారు ఎవరు?
నీకొచ్చిన కష్టం చూస్తే చీమకన్న చిన్నది!


బాధల్ని మోస్తూవుంటే... బరువై నిన్ను కూల్చుతుంది!
ధైర్యంగా ఒడుపుగ పట్టి గిరగిర త్రిప్పి దూరంగా విసురు..


ఓహో............ లా లా ల ల లల్లలాలె 
ఓహో.........
ఈ చిన్ని జీవితాన్ని అందంగా నువు మలుచుకొని...
అందరితో చేతులుకలిపి చిరునవ్వులతో ముందుకు సాగిపో ....   ||నిన్నే చూసి|| 


Friday, September 9, 2011

"I Hate You"ఇదే...నిజం!
అపుడు చెప్పలేకపోయిన నా మనసు,
నువు ఎప్పటికైనా వస్తావనే ఆశతో మూగబోయింది.
నీవులేని క్షణాలు నను ఉక్కిరిబిక్కిరి చేసాయి,
అది నిజమేనన్న బ్రమలో ఇంకొన్నాల్లు గడిచాయి,
ఆ అబద్దపు జీవితంలో ఒక్కోక్షణాన్ని యుగంలా గడిపాను...
వెలుగులో చీకటిని చూసాను,
నీటిలో ఎండమావిని వెదికాను,
పట్టపగలు వెన్నెలకై వేచాను,
నడిరేయిలో నీకై ఎదురుచూసాను,
నీ పేరునే రాస్తూ పరవశించిపోయాను,
అనుక్షణం నీరాకకై పరితపించిపోయాను,
ఇంకొన్నాళ్ళు ఇలానే వుండివుంటే....
నేటి నిజానికి చేరుకోలేకపోయేవాడ్నే!
మెల్లగా...పని వ్యాపకమైంది,
పెళ్ళితో నిజమైన ప్రేమ దొరికింది,
ఇక ఆ తర్వాత ఎపుడూ ఆ అబద్దపుజీవితం,
నా కలలో కూడా కనిపించేంత ధైర్యం చేయలేకపోయింది.
అబద్దమా......
ఇప్పుడు నీవెక్కడున్నావు?
ఒకవేళ నాప్రక్కనే ఉన్నా ...నా ఎదుటికిక ఎప్పటికీ రాకు....


Wednesday, September 7, 2011

జ్ఞాపకాల రాశులు
గతాన్ని త్రవ్వి చూసా...
జ్ఞాపకాల రాశులు బయటపడ్డాయి.
బాల్యం తప్పటడుగుల గురుతులు ఒకప్రక్క,
యవ్వనం తొలినాళ్ళ పులకింత ఓ ప్రక్క,
నాకోసం అమ్మపడిన కష్టమోప్రక్క,
నాన్న ఆలోచనల అంతరంగమోప్రక్క,
తొలిసారి నను ఆకర్షించిన చిరునవ్వులోప్రక్క,
స్నేహం పంచిన ఆప్యాయతోప్రక్క,
దూరమైన స్నేహితుల పిల్లుపులోప్రక్క,
నానుండి దూరమైన ప్రేమ పలకరింపులోప్రక్క,
తొలిసారి నీ నోటి నుండి జాలువారిన పలుకులోప్రక్క,
ఆ మాటలనే తలుచుకుంటూ గడిపిన తలపులోప్రక్క...


తప్పుచేసా......
గతాన్ని త్రవ్వి తప్పుచేసా...
క్షణాలు గడుస్తూ వుంటే,
గతం ఊబిలోకి కూరుకుపోతున్నా...
ఎంత ప్రయత్నించినా ప్రస్తుతానికి రాలేకపోతున్నా.....