Monday, February 18, 2013

Black & White


సీన్ : 1
---------
కొన్నేళ్ళ క్రితం సరిగ్గా ఇక్కడే....
మానవత్వానికి మనిషికి
దూరమెంతుందో చూపే మైలురాయిలా!
ఊరిబయట ఎప్పుడొచ్చిక్కడ
చేరాడో తెలియదుకానీ,
కాలంతో పాటే
కదులుతున్నట్లే అనిపించినా...
గోడగడియారంలో కడ్డీలా ఉన్నచోటే మిగిలిపోయాడు .

సీన్ : 2
----------
కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో
ఎన్నో సంఘర్షణల మధ్య ఎదురొడ్డి నిలబడ్డ
ఓ రాయి .... రాయే!
ఎవరు విసిరేసారో
ఎపుడు విసిరేసారో తెలియదు కానీ
దానికిన్నాళ్ళకో మంచి తోడుదొరికింది.

సీన్ : 3
--------
మనుషుల మధ్యే
ఓ ప్రశ్నగా మిగిలిన మనిషతడు!
ఈ విశాల ప్రపంచంలో
తనకంటూ మిగిలిందీ రాయొక్కటే!
ఎందుకు నవ్వుతాడో తెలియదు,
ఏం గుర్తొచ్చేడుస్తాడో తెలియదు,
కానీ ఎప్పుడూ ఏదోకటి చెప్తుంటాడు...
ఆ మాటలకడ్డుపడని రాయి,
ఆలకించిందో లేదో తెలియదు కాని,
చినుకు మీదపడ్డప్పుడల్లా,
ఆ మనిషి కష్టాలు గుర్తొచ్చి
ఏడ్చినట్టే కన్పించేదీ ప్రకృతికి!

సీన్ : 4
--------
ఇప్పుడక్కడంతా కోలాహలం!
ఎవడో ఓ అబద్దాన్ని
కల పేరు చెప్పి తీసుకొచ్చాడు!
అది రాయికాదట!
మనరాతల్ని మార్చే దేవుడట!
అట,అట అట.....అంతేనట!
ఎన్నాళ్ళుగానో ఇక్కడే ఉన్న
ఇతని ఆకల్ని గుర్తించని వీరికి!
రాయిలో దేవుడున్నాడంటే..
గుడికట్టించేందుకు
ముందుకొచ్చిన దాతలెందరో...


సీన్ : 5
--------
ఇప్పుడా రాయి....
ఎండకెండట్లేదు!
వానకి తడవట్లేదు
మాటల్రాని ఆ రాయికి.
నేను కేవలం రాయినే
అని చెప్పుకోలేని నిస్సహాయత!
నాకెందుకీ ప్రసాదాలు...
రోజూ వాడాకలి తీర్చండి
అని చెప్పేందుకు మాటిమ్మని
రోజూ ఆ దేవుడ్ని ప్రార్థిస్తూనే ఉంది...

సీన్ : 6
--------
ఇప్పటికీ ఆ మనిషిక్కడే ఉన్నాడు,
అప్పుడు ఊరి బైట!
ఇప్పుడు గుడి బైట!
కాకపోతే
ఇప్పుడేదన్నా చెప్పుకునేందుకు!
పక్కన ఆ రాయిలేదు!
అదిగుర్తొచ్చి గుడ్లోకి
పోయేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ,,
వాడికి దేవుడు పూనాడంటూ
హుండీల్నింపుకుంటున్నారు!
తన అకలి మాత్రం ఇంకా అలానే ఉంది !
మనబుర్రల్లో............................. అజ్ఞానంలా!!!