Wednesday, May 15, 2013

ఎందుకు రాములా???

1
ఎప్పట్లానే....
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కాడు రాములు!!!
మొదలెట్టిన చోటికే
తిరిగొస్తానని తెలిసీ 
నిన్నటికి దూరంగా
వెళ్ళాలనే ప్రయత్నంలో
ఐస్బండిని నెట్టుకెళ్తూ

2
రోజూ చేసే పనే అయినా
విసుగు రాదెందుకో...
విసుగురాదని మనమనుకోవటమేనేమో!
వచ్చినా దాన్ని రాములు
ఏరాత్రికారాత్రి
తన ఆత్మస్థైర్యపు వెలుగుకి
ఆవలున్న చీకట్లోకి విసిరేసి
తెలవారగానే
మళ్ళీ ఎప్పట్లానే
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కేస్తాడు రాములు!!!

3
ఏంది రాములా!!!
ఇంకెన్నేళ్ళు నెట్టుకొస్తావు
ఈ ఐస్బండిని
అన్న వారందరికీ
"నేను నెట్టుకొచ్చేది
ఇస్బండిని కాదు! నా కుటుంబాన్ని"
అన్న సమాధానం చెప్పికానీ,
ఆ కుటుంబాన్ని! కాదు కాదు
ఆ ఇస్బండిని నెట్టుకు పోడు...

4
కొందరి కళ్ళకి ఆ రోడెందుకో
నీరసంగా ఉంది కొన్ని రోజులుగా
రాములు పాదాల ముద్దుల్లేక!!!
అంతగా దగ్గరయ్యాడు చాలామందికి రాములు...

5
ఏమైఉంటుందోనని చూసేందుకు
రాములు ఇంటికి వెళ్లిన వారందనినీ
ఓ దృశ్యం మాత్రం కలచివేసిందాయింటి ముందు...!
అక్కడిప్పుడు
ఐస్‌ఫ్రూట్ తినటం పూర్తయ్యాక
విసిరి పరేసిన పుల్లలా
రాములు లేని ఐస్బండి!!!!!

Monday, May 13, 2013

అమ్మలేనితనం

ఆమె జీవితం ఓ సముద్రం,
ఎన్నో ఆటుపోట్లను తన
కన్నీటి తీరం దాటి రానిచ్చేది కాదు!
కానీ,
అవి దాటివచ్చిన ప్రతిసారీ
ఆమె చీరకొంగు తనలో
ప్రేమగా నింపుకునేది...

ఇప్పుడు అమ్మలేదు!!!
తనుగుర్తొచ్చి
నేను ప్రేమగా కొనిచ్చిన
చీరను హత్తుకొని
బాధ పడే ప్రతిసారీ
నా చేతిని అమ్మ చీరకొంగు
తడుపుతూనే ఉంది!!!


* అమ్మను కోల్పోయి ఆమె జ్ఞాపకాలతో బాధ పడేవారందరికీ..
...ఆమె ప్రేమ ఏదో ఒక రూపంలో మిమ్మలి స్పృశిస్తుంది...
...ఎప్పటికీ అలానే స్పృశిస్తూనే ఉండాలని ఆశిస్తూ....
...మాతృదినోత్సవ శుభాకాంక్షలు...